శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లో పసుపు నీరు తాగడం ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరంలో మంటలు తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పసుపు దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జింక్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలు శరీరంలో హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, పసుపు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పసుపు నీరు తాగడం వల్ల శరీరం లోపలి నుండి శుభ్రపడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, పసుపు నీరు తాగడం వల్ల దగ్గు, జలుబు రాకుండా ఉండటంతో పాటు శరీరంలో ఉత్పన్నమయ్యే మంటలు తగ్గుతాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఇది సరిపడకపోవచ్చు. కాబట్టి పసుపు నీరు తాగే ముందు వైద్యుల లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి.
వంటల్లో పసుపును తరచుగా ఉపయోగించే వారికి పసుపు నీరు తాగాల్సిన అవసరం ఉండదు. కానీ వంటల్లో పసుపు వాడని వారు, లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తక్కువ మోతాదులో పసుపు నీరు తాగవచ్చు. దీనిని నీటిలో మరిగించి గోరువెచ్చగా తాగడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, పసుపు నీరు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. సుగంధ ద్రవ్యాలు లేదా నూనె అధికంగా ఉండే ఆహారం తిన్న తర్వాత పసుపు నీరు తాగరాదు. అదేవిధంగా, ఎక్కువ మోతాదులో పసుపు నీరు తాగడం జీర్ణ సంబంధిత ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి ప్రతిరోజూ తగిన మోతాదులో మాత్రమే పసుపు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.