దేవాలయాలకు భక్తులు సమర్పించే నిధులు, విరాళాలు పవిత్రమైనవి. వాటిని ప్రభుత్వం స్వేచ్ఛగా ఉపయోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని ఐదు ప్రముఖ దేవాలయాల నిధులను ఉపయోగించి వివాహ మండపాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టు ముందు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన మదురై బెంచ్, ఆగస్టు 19న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అద్దెకు ఇచ్చే మండపాల నిర్మాణం మతపరమైన కార్యకలాపాలకు చెందదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విన్నది. “భక్తులు దేవాలయాలకు సమర్పించే విరాళాలు దేవాలయ అభివృద్ధికి, మతపరమైన కార్యక్రమాలకు లేదా ప్రజా సేవలకే వినియోగించాలి. కానీ ఆ డబ్బుతో కేవలం అద్దె కోసం కల్యాణ మండపాలు నిర్మించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అవుతుంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇంకా ముందుకు వెళ్ళి, “ఒకవేళ దేవాలయ ప్రాంగణంలోని మండపంలో వివాహ వేడుక జరుగుతుంటే, అక్కడ అసభ్యకరమైన పాటలు, డ్యాన్స్ లు జరుగుతుంటే దాన్ని మతపరమైన పని అనొచ్చా?” అని ప్రశ్నించింది. దేవాలయ నిధులను విద్య, వైద్య వంటి ప్రజా సేవా రంగాల్లో ఉపయోగిస్తేనే దాని పుణ్యం పెరుగుతుందని సుప్రీంకోర్టు సూచించింది. భక్తులు సమర్పించే నిధులు ప్రభుత్వం ఖజానాకు సంబంధించినవి కాదని, వాటిని ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదని స్పష్టంగా తెలిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా కాదా అనేది ఇక్కడ అసలు వివాదమని కోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించమని కోరిన ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూర్తి స్థాయి విచారణ జరపనున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. దీంతో ఆలయ నిధుల వినియోగం విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది.