దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా, డిమాండ్ ఉన్న రూట్లలో కొత్త రైళ్లను కూడా కేంద్రం ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు కొత్త వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్రాన్ని కోరినట్టు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళపాలెం దగ్గర ఆర్‌యూబీ సమస్యలపై కూడా మంత్రి స్పందించి ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో మొదలవుతాయని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఖండించారు. విశాఖ–తిరుపతి వందేభారత్ రైలు వస్తే తిరుమల భక్తులకు అదనపు సౌకర్యం కలుగుతుందని అన్నారు.
అదేవిధంగా, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కూడా ఎంపీ తెలిపారు. ఈ ప్రతిపాదనపై సానుకూల స్పందన వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అంతేకాక, విశాఖలో దక్షిణ భారత నోడల్ హబ్‌గా డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు.
విశాఖ నుంచి బెంగళూరు, విశాఖ నుంచి తిరుపతి వందేభారత్ రైళ్ల డిమాండ్ చాలా కాలంగా ఉందని, ఇప్పుడు ఆ ప్రతిపాదనలపై రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలోని కొన్ని రైల్వే స్టేషన్‌లలో వందేభారత్ రైళ్లు ఆగేందుకు అనుమతులు కూడా లభించాయి. ఇటీవల హిందూపురం స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందేభారత్ ఆగేందుకు రైల్వే మంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.