ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన 8 కోట్ల మంది సభ్యుల కోసం సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ EPFO 3.0 ను త్వరలో ప్రారంభించబోతోంది. ఈ ఆధునిక వ్యవస్థతో పీఎఫ్ సేవలు మరింత వేగంగా, సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి రానున్నాయి. మొదట జూన్‌లో లాంచ్ చేయాలని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరిగింది. అయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తుండటంతో, త్వరలోనే సభ్యులందరికీ ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.
ఈ కొత్త వ్యవస్థలో ప్రధాన ఆకర్షణ ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసే సౌకర్యం. సభ్యులు తమ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసుకుంటే కార్యాలయానికి వెళ్లకుండానే నిధులను ఉపసంహరించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ ద్వారా కూడా వెంటనే డబ్బు తీసుకునే వీలుంది.
అలాగే వ్యక్తిగత వివరాల దిద్దుబాటు, క్లెయిమ్ ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ చేయబడ్డాయి. ఇకపై ఉద్యోగులు మొబైల్‌లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. పీఎఫ్ సభ్యుడు మరణించిన సందర్భంలో మైనర్ పిల్లలు క్లెయిమ్ చేసుకునేందుకు గార్డియన్ సర్టిఫికేట్ అవసరం లేకుండా త్వరగా ఆర్థిక సహాయం పొందే వీలుంది.
ఇంకా ఒక ప్రధాన ఫీచర్ డిజిటల్ డాష్‌బోర్డ్. దీని ద్వారా సభ్యులు నెలవారీ డిపాజిట్లు, క్లెయిమ్ స్టేటస్, ఖాతా వివరాలు అన్నీ ఒకే చోట చూసుకోగలరు. ఈ విధానం పారదర్శకతను పెంచడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక భద్రతకు దోహదం చేస్తుంది. ఇప్పటికే కేవైసీ వెరిఫికేషన్, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బదిలీ ప్రక్రియలు వేగంగా మారాయి. ఈపీఎఫ్‌వో చేపడుతున్న డిజిటల్ సంస్కరణలు ఉద్యోగుల జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.