ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎదురయ్యే సవాళ్లను ప్రణాళికబద్ధంగా అధిగమించాలని అధికారులకు సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అడవితల్లి బాట’ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రహదారులు అందుబాటులోకి వస్తే, ఆ ప్రాంతాల్లో జీవన విధానంలో విశేషమైన మార్పులు వస్తాయని, రవాణా, విద్య, వైద్య సేవలు సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాక, స్థానిక ప్రజలకు ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించి, వారి సహకారాన్ని పొందాలని పవన్ కళ్యాణ్ అధికారులను దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం రహదారులతో మాత్రమే కాకుండా, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, విద్యా సదుపాయాలు కల్పించడం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.