గేట్ 2026 నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఐఐటీ గువాహటి ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టగా, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి గేట్‌లో కొత్తగా ఎనర్జీ సైన్స్ (XE-I) పేపర్‌ను ప్రవేశపెట్టడంతో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరింది.
ఫీజులు, మార్పులు, పరీక్ష తేదీలు
అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000, ఇతర కేటగిరీల వారికి రూ.2000 చొప్పున ఫీజు నిర్ణయించారు. కేటగిరీ మార్పు, పరీక్షా నగరం మార్చుకోవడం, కొత్త పేపర్ జోడించుకోవడం వంటి అవకాశాలు నవంబర్ 6 వరకు ఉంటాయి. గేట్ 2026 రాత పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులు జనవరి 2 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు మార్చి 19న విడుదల కానున్నాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్, స్కోరు చెల్లుబాటు
గేట్ 2026 పరీక్ష మూడు గంటలపాటు జరగనుంది. మొత్తం 65 ప్రశ్నలు, 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ విధానం అమలులోనే ఉంది. ఒక మార్కు ప్రశ్న తప్పిస్తే 1/3 మార్కు, రెండు మార్కుల ప్రశ్న తప్పిస్తే 2/3 మార్కు కోత ఉంటుంది. గేట్ స్కోరు పీజీ కోర్సుల ప్రవేశాలకు మూడు ఏళ్ల పాటు, పీఎస్‌యూ నియామకాలకు రెండు ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.