ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను మళ్లీ విడుదల చేస్తూ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ), భారీ మరియు మెగా యూనిట్లకు ఆర్థిక బలాన్నివ్వాలని నిర్ణయించింది. మొత్తం రూ.1,030.95 కోట్ల ప్రోత్సాహకాలను ఈసారి విడుదల చేయబోతోంది. ఇందులో తొలి విడతగా 2,536 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రూ.275.47 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీపావళి సందర్భంగా ఈ నిర్ణయం పారిశ్రామికవేత్తలకు గిఫ్ట్‌లా మారింది. గత ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో అనేక పరిశ్రమలు మూతపడే దశకు చేరగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆర్థిక చైతన్యాన్ని నింపేందుకు ముందడుగు వేసింది.
ఇక ‘జగనన్న బడుగు వికాసం’ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బస్సులు మంజూరు చేసి, వాటిని ఆర్టీసీ లో నడిపేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ పథకంలో రూ.100 కోట్ల నకిలీ ఇన్వాయిస్ కుంభకోణం జరిగిందని దళిత్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద మంజూరైన 426 బస్సులకు సంబంధించిన ప్రోత్సాహకాల వివరాలు సేకరించాలని పరిశ్రమల శాఖ డీలర్లను ఆదేశించింది. ఇప్పటివరకు 310 బస్సులకు సంబంధించిన వివరాలు అందగా, వాటికి ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. మిగతా 116 బస్సుల వివరాలు అందిన తర్వాత మరో రూ.14 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం కఠిన నిఘా పెట్టింది.
ఇదే సమయంలో టెక్స్‌టైల్ పరిశ్రమలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు చెల్లిస్తే కొంత ఊరట లభిస్తుందని పరిశ్రమల వర్గాలు సూచించాయి. ప్రభుత్వం ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, కొన్ని నిబంధనలను సడలించింది. ఆరేళ్లు పూర్తయిన ఎంఎస్‌ఎంఈలు, ఎనిమిదేళ్లుగా ఉత్పత్తిలో ఉన్న భారీ మరియు మెగా యూనిట్లకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. పరిశ్రమలు ప్రస్తుతం మూతపడినా, యాజమాన్యం మారినా ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కొత్త జీవం పోయనుంది.
అదనంగా, గతంలో బడుగు వికాసం పథకం కింద ఇచ్చిన బస్సులకు సంబంధించిన రిబేట్/డిస్కౌంట్ వివరాలను పరిశీలించి, వాటికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీలర్ల నుంచి పొందిన డిస్కౌంట్ మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నారు. స్టేట్ లెవెల్ కమిటీ ఈ కేసులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, ఆడిట్ శాఖ నుంచి క్లియర్ అయిన యూనిట్లకు మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. ఎన్వోసీ లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చిన యూనిట్లకు కూడా సడలింపు ఇచ్చి, ప్రోత్సాహకాలు అందించే మార్గం సుగమం చేశారు. మొత్తం మీద ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం మళ్లీ ఉత్సాహభరిత దశలోకి ప్రవేశించనుందని పరిశ్రమల వర్గాలు విశ్లేషిస్తున్నాయి.