Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి!

Bhuvaneshwari Kuppam Tour: ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు.

Published : 2026-03-27 15:47:00
  • Politics: ట్రస్ట్ నిర్వహణలో దాతలు, సిబ్బంది సహకారం మరువలేనిది..
     
  • కుప్పం నియోజకవర్గంలో ముగిసిన  నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన.. 

Bhuvaneshwari Kuppam Tour: ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల  పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలతో సమావేశమయ్యారు. 4వ రోజు పర్యటనలో ముందుగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుప్పంలో కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బాల్య స్నేహితుడు చంద్రశేఖర్ ఇంటికి  భువనేశ్వరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.  ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బాల కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పేదలకు అండగా ట్రస్ట్ సేవలు
ఎన్టీఆర్ స్పూర్తితో, సీఎం చంద్రబాబు సహకారంతో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయింది.  చంద్రబాబు గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ట్రస్ట్ బాధ్యతలు నాకు అప్పగించారు. చంద్రబాబు గారు అందించిన స్పూర్తితో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం.  తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా వంతు సాయం అందిస్తున్నాం. దాతలు కూడా మాకు సాయంగా నిలుస్తున్నారు.  త్వరలోనే విజయవాడ , అనంతపురంలో కూడా తలసేమియా సెంటర్లు ప్రారంభిస్తాం.  ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో నాలుగు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తున్నాం. త్వరలో విజయవాడలో ప్రారంభిస్తాం. తలసేమియా బాధితుల కోసం మే 10న హైదరాబాద్ లో నిర్వహించే రన్ లో అందరూ పాల్గొని వారికి ధైర్యం చెప్పాలని భువనేశ్వరి కోరారు.

ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి కల్పన
ఎన్టీఆర్ ట్రస్ట్  ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపుల నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా 23 లక్షలమందికి సేవలు అందించాం. ఇందుకోసం రూ.23 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ఏజెన్సీ ఏరియాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్, డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ద్వారా  గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే పిల్లలకు గణితం, ఆంగ్లంలో పట్టు సాధించేలా శిక్షణ అందిస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే అందుకు దాతలు, మా సిబ్బంది సహకారమే కారణం. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నాకు చంద్రబాబు గారు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. ఏదైనా చేయగలను అని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే విజయం సాధించగలం. మహిళల ఆర్థక స్వావలంబన కోసం కుప్పంలో స్త్రీ శక్తి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళల ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం హైదరాబాద్ లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ ఏర్పాటు చేశామని భువనేశ్వరి తెలిపారు. అనంతరం 40  మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు , పలువురికి వినికిడి మిషన్లను భువనేశ్వరి అందజేశారు. 

Spotlight

Read More →