ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ నియామకాల దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది వేలాది ఉద్యోగులను తొలగించి గ్లోబల్ మార్కెట్‌ను షాక్‌కు గురి చేసిన ఈ సంస్థ, ఇప్పుడు మరోసారి ఉద్యోగావకాశాలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి నియామకాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని కంపెనీ ప్రకటించింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో నైపుణ్యం కలిగిన వారికే పెద్దపీట వేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. ‘మా రిక్రూట్‌మెంట్ ఇకపై స్మార్టర్, టార్గెటెడ్ పద్ధతిలో ఉంటుంది’ అని ఆయన చెప్పారు.
సత్య నాదెళ్ల ఇటీవల ఇన్వెస్టర్ బ్రాడ్ గెర్స్ట్‌నర్‌తో జరిగిన బీజీ2 పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కంపెనీ భవిష్యత్ దిశను వివరించారు. 2025 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల సంఖ్య సుమారు 2.28 లక్షలకు చేరుతుందని చెప్పారు. గతంలో 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినా కంపెనీ సిబ్బంది సంఖ్య పెద్దగా తగ్గలేదని ఆయన తెలిపారు. ఏఐ బూమ్ రాకముందు 2022లో ఉద్యోగుల సంఖ్యను 22 శాతం పెంచామని, ప్రస్తుతం మాత్రం ఏఐ ఆధారిత వ్యూహాలతో ఉద్యోగులను ఎంపిక చేసే దశ మొదలైందని చెప్పారు.
నాదెళ్ల ప్రకారం, మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం భారీగా నియామకాలు చేయడాన్ని తగ్గించి “టార్గెటెడ్ స్కేలింగ్” దశలోకి అడుగుపెట్టింది. అంటే, అవసరమైన చోట్ల, ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారినే ఎంపిక చేయడం ప్రధాన లక్ష్యం. కంపెనీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అలాగే ఏఐ మౌలిక సదుపాయాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టనుంది. చిన్న బృందాలు కూడా ఏఐ సాయంతో అద్భుత ఫలితాలు సాధించగలవని నాదెళ్ల స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి తన పనిలో ఏఐని ఉపయోగించడం తప్పనిసరని, ఇది కొత్త తరం పనిమార్గం అవుతుందని చెప్పారు.
అయితే ఈ పునర్నిర్మాణ దశలో మైక్రోసాఫ్ట్ ఇంకా కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది కంపెనీ మొత్తం ఉద్యోగులలో 4 శాతం, అంటే దాదాపు 9,000 మందిని పనుల నుంచి తప్పించింది. ముఖ్యంగా గేమింగ్ (ఎక్స్‌బాక్స్) విభాగంపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. వ్యూహాత్మక రంగాలపై దృష్టి కేంద్రీకరించేందుకు తీసుకున్న చర్యగా ఎక్స్‌బాక్స్ హెడ్ ఫిల్ స్పెన్సర్ వివరించారు. మొత్తంగా చూస్తే, మైక్రోసాఫ్ట్ ఇకపై ‘ఏఐ ఆధారిత సంస్థ’గా పునరావిష్కృతమవుతోందని చెప్పవచ్చు.