IPL tickets: ఐపీఎల్ అభిమానుల‌కు అల‌ర్ట్‌.. నకిలీ ఐపీఎల్ వెబ్‌సైట్ల జోరు.. డబ్బు, డేటా రెండూ చోరీ!

IPL tickets: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంటున్న వేళ, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ అభిమానుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని మోసం చేసేందుకు 1,000కి పైగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు.

Published : 2026-05-13 12:58:00
  • డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మాల్‌వేర్‌ను వ్యాప్తి చేస్తున్న కేటుగాళ్లు..
     
  • Sports: ఐపీఎల్ సీజన్‌లో అభిమానులే లక్ష్యంగా 1000కి పైగా నకిలీ డొమైన్లు..

IPL tickets: దేశవ్యాప్తంగా ఐపీఎల్ మేనియా కొనసాగుతున్న తరుణంలో, క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు తెరలేపారు. ఐపీఎల్ టికెట్లు మరియు ఉచిత స్ట్రీమింగ్ పేరుతో వల వేస్తూ, ఏకంగా 1,000కి పైగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ 'క్లౌడ్‌సెక్' తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మోసపూరిత నెట్‌వర్క్‌లో టికెట్ల విక్రయాల కోసం 600కు పైగా ఫేక్ డొమైన్లు, ఉచితంగా మ్యాచ్‌లను చూపిస్తామంటూ నమ్మించే 400కు పైగా స్ట్రీమింగ్ సైట్లు చురుకుగా పనిచేస్తున్నాయని క్లౌడ్‌సెక్ విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల సమయంలో టికెట్ల కోసం ఆతృతగా వెతికే అభిమానుల బలహీనతను నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

నకిలీ వెబ్‌సైట్లు అచ్చం అధికారిక పోర్టల్‌లను తలపించేలా లోగోలు, లేఅవుట్‌లతో రూపొందించడం వల్ల సామాన్య అభిమానులు సులభంగా మోసపోతున్నారు. యూజర్ల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరించి, యూపీఐ లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేసిన తర్వాత, వారికి నకిలీ బుకింగ్ ఐడీలతో కూడిన పీడీఎఫ్ టికెట్లను కూడా పంపిస్తున్నారు. తీరా స్టేడియం వద్దకు చేరుకున్నాకే అవి చెల్లవని బాధితులు గుర్తించి లబోదిబోమంటున్నారు. నేరగాళ్లు కేవలం డబ్బులు వసూలు చేయడమే కాకుండా, మెటా పిక్సెల్ వంటి సాంకేతికతను ఉపయోగించి బాధితుల డేటాను సేకరించి భవిష్యత్తులో ఇతర మోసాలకు లేదా డేటా విక్రయాలకు వాడుకుంటున్నారని క్లౌడ్‌సెక్ పరిశోధకుడు సౌరజీత్ మజుందర్ హెచ్చరించారు.

మరోవైపు, ఉచిత స్ట్రీమింగ్ పేరుతో జరిగే మోసాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. "ఐపీఎల్ ఫ్రీ లైవ్ స్ట్రీమ్" వంటి సెర్చ్ ఫలితాల ద్వారా వినియోగదారులను ఆకర్షించి, వారి ఫోన్లు మరియు కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను పంపడానికి ఈ సైట్లు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా కీలకమైన పాస్‌వర్డ్‌లను దొంగిలించడం, అనుమానాస్పద లింకులకు దారి మళ్లించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అందుకే అభిమానులు అత్యంత అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక మరియు విశ్వసనీయ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని లేదా మ్యాచ్‌లు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →