జైలులోనే కొనసాగనున్న వైసీపీ ఎమ్మెల్సీ..
బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు..
రాజమహేంద్రవరం: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు, కేసుకు సంబంధించిన సాక్షులను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. నలుగురు కీలక సాక్షులను ప్రలోభపెట్టడంతో పాటు ఒత్తిళ్లు తెచ్చినట్లు సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేశారు.
సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 24న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
హత్య కేసులో బెయిల్‌పై ఉంటూ సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరింపులకు పాల్పడటం చాలా తీవ్రమైన ఉల్లంఘనగా కోర్టు పరిగణించింది. సాక్షులను బెదిరించినట్లు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు బలంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది.
పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. సాక్షుల భద్రత, కేసు విచారణ పారదర్శకత దృష్ట్యా బెయిల్ కొనసాగించడం సరికాదని కోర్టుకు వివరించారు. ఇక ఈనెల 20వ తేదీ నుంచి డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో రెగ్యులర్ విచారణ ప్రారంభం కానుందని కోర్టు వెల్లడించింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కోర్టు తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.