ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నగదు లావాదేవీలకంటే సౌకర్యవంతంగా ఉండడం వల్ల చాలా మంది ఒకటి కాదు, రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కానీ ప్రతి కార్డు వినియోగదారునికి బ్యాంకులు నిర్ణయించే లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ వ్యక్తి ఆదాయం, ఖర్చు, బిల్లులు కట్టే విధానం, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది తమ లిమిట్ తక్కువగా ఉందని భావించి దానిని పెంచుకోవాలని చూస్తారు. అయితే లిమిట్ పెంపు అనేది కేవలం రిక్వెస్ట్‌తో సాధ్యంకాదు, దానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు అవసరం.
క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉండి దానిని పూర్తిగా వినియోగిస్తే, మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) తగ్గిపోతుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ను కొనసాగించాలంటే లిమిట్లో 30% లోపు మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు ₹1,00,000 లిమిట్ ఉంటే ₹30,000 లోపు మాత్రమే వాడటం ఉత్తమం. కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సాధ్యం కాని పరిస్థితి. అప్పుడు లిమిట్ పెంచుకోవడం వల్ల మీకు అదనపు ఆర్థిక స్థలాన్ని కల్పిస్తుంది, అదే సమయంలో స్కోర్‌ను కూడా కాపాడుతుంది.
బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ హిస్టరీని బట్టి ఆటోమేటిక్‌గా లిమిట్‌ను పెంచుతాయి. మీరు ఎప్పుడూ మీ ఈఎంఐలు, బిల్లులు సమయానికి కడుతూ ఉంటే, బ్యాంకులు మిమ్మల్ని నమ్మదగిన కస్టమర్‌గా పరిగణించి లిమిట్ పెంచుతాయి. అలాగే మీరు స్వయంగా కూడా బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీకి రిక్వెస్ట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్స్ లేదా ఇన్కమ్ ప్రూఫ్ సమర్పించడం అవసరం అవుతుంది.
క్రెడిట్ కార్డు లిమిట్ మీ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు శాలరీ హైక్ వస్తే లేదా కొత్త ఉద్యోగంలో అధిక వేతనంతో చేరితే, ఆ వివరాలను బ్యాంకుకు తెలియజేయండి. వారు మీ క్రెడిట్ లిమిట్‌ను తగిన విధంగా పెంచుతారు. అదేవిధంగా, మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (మొత్తం లిమిట్లో ఎంత వాడుతున్నారు) 30% కంటే తక్కువగా ఉంచడం అలవాటు చేసుకుంటే, అది కూడా బ్యాంకులకు మంచి సిగ్నల్ ఇస్తుంది. మొత్తానికి సమయానికి బిల్లులు చెల్లించడం, బాధ్యతగా ఖర్చు చేయడం, ఆదాయం పెంచుకోవడం — ఇవన్నీ కలిపి మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచే కీలక మార్గాలు.