శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీగా నీరు వచ్చి చేరడంతో అధికారులు జల నియంత్రణ చర్యలు చేపట్టారు. మొత్తం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 2,66,325 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,82,478 క్యూసెక్కులుగా ఉంది.
పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది. నీటి ప్రవాహం పెరగడంతో కుడి మరియు ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతోంది. వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.