హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో జులై 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాటి ప్రభావంతో నగరంలో పలు చోట్ల వర్షపు నీరు నిలిచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో – ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొచ్చని, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశముందని అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి రహదారులపై వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని సూచించగా, రోడ్డు, రైల్వే శాఖలతో సమన్వయం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        