టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు సుదీర్ఘ సమయం తర్వాత నేడు (జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నేను ఏపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని... పంచాయితీలు చేసి సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. జీవితంలో నాకు ఏదీ అంత సులభంగా దక్కలేదు... ఈ సినిమా కూడా అంతే. ఉప ముఖ్యమంత్రిని కదా... సినిమా విడుదల ఈజీ అనుకున్నాను... కానీ వారం రోజులు నిద్రపోలేకపోయాను. ఈ రెండ్రోజుల్లో నేను మాట్లాడిన మాటలు, నా 29 ఏళ్ల సినీ ప్రయాణంలో 10 శాతం కూడా మాట్లాడి ఉండను. 
ఇవాళ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ కు రావడంలో ఆలస్యమైంది. అమరావతిలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొనడం వల్ల లేటైంది. అందుకు నన్ను క్షమించాలి. గతంలో నేను ఎప్పుడూ ఇలా సక్సెస్ మీట్లలో పాల్గొనలేదు. ఇదే తొలిసారి” అని పవన్ కల్యాణ్ వివరించారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        