ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సంస్థకు మంజూరైన రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు ప్రాజెక్టులు మన్యం పార్వతీపురం జిల్లాలో ఉన్నాయి. కురుకుట్టిలో 1,200 మెగావాట్లు, కర్రివలసలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు ఇచ్చారు. అయితే, ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో, స్థానిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టులను రద్దు చేయాలని AGEL ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఇందుకు అనుగుణంగా, జూలై 17న నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో డెవలపర్ అభ్యర్థనను పరిశీలించి, ప్రాజెక్టుల రద్దుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్య నివేదికలను టీసీఈ లిమిటెడ్ తయారు చేయగా, సర్వేలు, DPR తయారీ బాధ్యతను అదానీ సంస్థ చేపట్టింది. ఇప్పుడు, ప్రాజెక్టుల రద్దుతోపాటు సంస్థ చెల్లించిన ఫెసిలిటేషన్ ఛార్జీలను తిరిగి చెల్లించాలంటూ లేదా వాటిని పెదకోట (1000 మెగావాట్లు), రైవాడ (600 మెగావాట్లు) ప్రాజెక్టులకు బదిలీ చేయాలంటూ అదానీ సంస్థ కోరింది. ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రాజెక్టులను AGELకు కేటాయించింది.