లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేసిందని మోదీ పేర్కొన్నారు. "భారత దళాల దాడులతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. వాళ్లే మొదట సీజ్ఫైర్ కోసం అడిగారు. వాళ్ల DGMO (Director General of Military Operations) మాకు కాల్ చేసి సీజ్ఫైర్ చేయాలని వేడుకున్నారు" అని వివరించారు.
అంతేకాక, ఆ సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా తనతో మాట్లాడారని తెలిపారు. పాక్ భారీ దాడులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని వారు హెచ్చరించారని చెప్పారు. పాకిస్థాన్ ఏం చేసినా అది తానే మూల్యం చెల్లించుకోవాలి. మేము స్పష్టంగా వారిని హెచ్చరించాం అని మోదీ తెలిపారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు అమాయకులపై దాడికి పాల్పడిన విషయాన్ని ప్రధాని సవివరంగా వెల్లడించారు. "వారు మతం అడిగి మరీ అమాయకులను చంపేశారు. ఇది మానవత్వానికి తగదు. అందుకే వెంటనే ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది" అని మోదీ వెల్లడించారు.
"సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వారు సరిహద్దులు దాటి ప్రత్యక్షంగా ఉగ్ర శిబిరాలపై దాడులు చేశారు. ఆ దాడుల తర్వాత ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేదు. ఈ చర్యల వల్లే దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగింది. భారత్ తన ప్రజల కోసం ఎప్పుడైనా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది" అని ప్రధాని చెప్పారు.