ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల పెంపుకే ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం వేదికగా పార్ట్నర్‌షిప్ సమ్మిట్ నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఈ సమ్మిట్ సమగ్ర విజయవంతం కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పలు కమిటీలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆరుగురు మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి బృందానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ బృందంలో టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు.
అదేవిధంగా, వసతుల కల్పన, అతిథుల స్వాగతం, భద్రతా ఏర్పాట్లు, లాజిస్టిక్స్, సమావేశాల నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో 9 ప్రత్యేక వర్కింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమ్మిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పెట్టుబడుల కేంద్రంగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.