ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా మలేసియాకు చెందిన విశ్వప్రసిద్ధ ఎవర్సెండై కార్పొరేషన్ (Eversendai Corporation) ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.
ప్రపంచ ప్రాజెక్టుల్లో ఎవర్సెండై దౌత్యం
ఈ సంస్థ గతంలో బుర్జ్ ఖలీఫా (దుబాయ్), పెట్రోనాస్ టవర్స్ (మలేసియా), స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (గుజరాత్), చెన్నై డీఎల్‌ఎఫ్ డౌన్‌టౌన్ తారామణి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే సంస్థ ఏపీలో అడుగుపెడుతుండటంతో అభివృద్ధి వర్గాల్లో ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది.
విశాఖ - కృష్ణపట్నంలో ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ
సింగపూర్‌లో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఎవర్సెండై కార్పొరేషన్ సీఎండీ తాన్‌శ్రీ ఎ.కె. నాథన్… రాష్ట్రంలో 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ, శిక్షణ కేంద్రాన్ని విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ నుండి దేశవ్యాప్తంగా ఫ్యాబ్రికేషన్ అవసరాలకు సరఫరా చేస్తామని కంపెనీ పేర్కొంది.
అలాగే అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశం కూడా సంస్థకు ఉందని వెల్లడించారు. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అంశంపై కూడా చర్చలు జరిగాయి.
తెలుగు ప్రజల ప్రతిష్ఠ – చంద్రబాబు పిలుపు
తన పర్యటనలో భాగంగా తెలుగు డయాస్పోరాతో సమావేశమైన సీఎం చంద్రబాబు… “ఒకరు తప్పు చేస్తే, అది ఓ తెలుగు వ్యక్తి చేశాడని అంటారు. అందుకే మన ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండాలి” అని అన్నారు. 2019లో వైసీపీ సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో ఆ సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు వాటిని పునరుద్ధరించడం తన ముఖ్య లక్ష్యమన్నారు.
జన్మభూమికి సేవ చేయండి
ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో తెలుగు వారు ఉన్నారని, 40 వేల మందికిపైగా సింగపూర్‌లోనే ఉన్నారని తెలిపారు. “మీరు పన్నుల రూపంలో దేశానికి చేసిన కృషికి ప్రతిగా, ఇప్పుడు జన్మభూమికి సేవ చేయండి. పీ4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు పని చేస్తున్నాం. మీరు మీ గ్రామాల్లోని పేదలను దత్తత తీసుకుని మార్పుకు భాగస్వాములైండి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.