ఆంధ్రప్రదేశ్‌కు క్యాన్సర్ చికిత్సలో మద్దతుగా కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో భాగంగా Day Care Cancer Centres (DCCC) ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 200కి పైగా డీసీసీసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 14 కేంద్రాలు ఏపీలోనే ఉండనున్నాయని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ తెలిపారు.
ఈ కేంద్రాల ఏర్పాటుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ఆధారంగా క్యాన్సర్ రిజిస్ట్రీ డేటాను విశ్లేషించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి జిల్లా స్థాయిలో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో కేంద్రం స్థాపనకు సుమారు రూ.1.49 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. స్థలం, లాజిస్టిక్స్ లభ్యతకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, ఎన్టీఆర్, కాకినాడ, నంద్యాల, బాపట్ల, విజయనగరం, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి, అన్నమయ్య, కృష్ణా, పల్నాడు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా క్యాన్సర్ రోగులకు రోజువారీ చికిత్సలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. రోగులకు సులభంగా సేవలు అందడం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ఈ కేంద్రాల లక్ష్యం.
కేంద్ర బడ్జెట్ ప్రకారం రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఈ డీసీసీసీలు స్థాపించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. దీని ద్వారా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లోను అధునాతన చికిత్సలు అందించే అవకాశం ఏర్పడుతుంది. Healthcare accessలో ఇది game changer కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.