ఏపీలో కరెన్సీ నోట్లకు ‘ఆస్పత్రులు’ ఉన్నాయని మీకు తెలుసా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! చిరిగినా, కాలిపోయినా నోట్లకు జీవం పోసే ఈ కేంద్రాలు గుంటూరులోని జిన్నా టవర్ వద్ద ప్రారంభమయ్యాయి. 1970ల నుంచి ఈ 'నోట్ల ఆస్పత్రి' బిజినెస్ కొనసాగుతోంది. పాడైపోయిన నోట్లను స్థానికులు ఇక్కడకు తీసుకెళ్లి, నోట్ల పరిస్థితిని బట్టి కొత్త నోట్లు అందుకుంటున్నారు.
పూర్తిగా కాలిపోకపోయినా, కొంత మిగిలిన నోట్లకు విలువ తగ్గించి, దానికి తగ్గ నష్టాన్ని కట్ చేసి మంచి నోట్లు ఇస్తారు. ఉదాహరణకు రూ.500 నోటు కొంత భాగం పాడై ఉంటే, దాని పరిస్థితిని బట్టి రూ.200 నుంచి రూ.350 వరకు ఇస్తారు. మిగతా నష్టాన్ని కమిషన్‌గా వసూలు చేస్తారు.
ఇక్కడ మాత్రమే కాదు, ఈ నోట్ల ఆస్పత్రులకు విజయవాడ, తెనాలి, రాజమహేంద్రవరం లాంటి పట్టణాల్లో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ సేవలు వినియోగిస్తున్నారు.
ఇటీవల ఓ వ్యక్తి రూ.10, రూ.50, రూ.500 నోట్లు కలిపి రూ.970 విలువైన పాడైపోయిన కరెన్సీని గుంటూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అంచనా వేసిన తర్వాత రూ.750 విలువ చేసే మంచి నోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. అంటే, కమిషన్‌గా రూ.220 తీసుకున్నారు.
ఇలా చిరిగిన, కాలిన నోట్లు చేతిలో ఉంటే.. మీరు కూడా ఈ నోట్ల ఆస్పత్రులను ఆశ్రయించి మార్చుకోవచ్చు. కానీ... కండిషన్స్ అప్లై!
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        