ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 రోజుల విదేశీ పర్యటన కోసం ఇవాళ సింగపూర్ బయలుదేరనున్నారు. జూలై 26 నుంచి 31 వరకు జరిగే ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, 'బ్రాండ్ ఏపీ'ని ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుకు ఇది రెండో విదేశీ పర్యటన. ఇప్పటికే ఆయన స్విట్జర్లాండ్‌లోని డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్నారు. తాజా పర్యటనలో ఆయన గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార నాయకులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం (1,053 కిలోమీటర్లు), ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, హైవేలు, నీటి వనరులు, భూమి, కౌశల్యవంతులైన మానవ వనరుల విశిష్టతలను వివరించి పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతారు. ముఖ్యంగా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, సెమీకండక్టర్ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు వంటి రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు.
అమరావతి అభివృద్ధికి మళ్లీ సింగపూర్ ప్రభుత్వం, ఇన్వెస్టర్లతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నదీ ఈ పర్యటనలో మరో ముఖ్య ఉద్దేశం.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        