ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయ్యారు. రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా మాదిరెడ్డి ప్రతాప్‌ను నియమించారు. అలాగే అగ్నిమాపకశాఖ డైరెక్టర్ వెంకటరమణకు ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ శ్రీధర్‌రావును సీఐడీ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
ఆయుష్ విభాగంలో పోస్టుల భర్తీ మరోవైపు ఆయుష్ విభాగంలో పోస్టులు భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఆయుష్ విభాగంలోని 358 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా 71 మంది డాక్టర్ పోస్టులు, 26 జిల్లాలకు ప్రోగ్రాం మేనేజర్ల పోస్టులు, అలాగే సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా 90 మంది పంచకర్మ థెరపిస్టులను నియమించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వెంటనే నియామకాలు చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయుష్ సేవలను చిన్నచూపు చూశారన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. కేవలం రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసి నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2024-25 ఏడాది గానూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. క్వాంటం వ్యాలీలో క్యూపీఐఏఐ భాగస్వామ్యం మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మరో సంస్థ భాగస్వామ్యం కానుంది. క్యూపీఐఏఐ సంస్థ అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామ్యం కానుంది.
అందులో భాగంగా 8 క్యూబిట్ సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్‌ను క్యూపీఐఏఐ సంస్థ క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేయనుంది. సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్, ఇతర ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడును గురువారం సచివాలయంలో కలిసి ఈ విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, అప్లికేషన్‌లను రూపొందించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.