ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎస్ఐపీబీ సిఫార్సుల ప్రకారం సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు, లేఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన చట్ట సవరణలపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేసే అంశంపై చర్చించనున్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ ప్యాకేజీలకు, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌ల లేఔట్లపై కమిటీ సిఫార్సులపై కేబినెట్ చర్చించనుంది. వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించనున్నారు. మొత్తం 815 పోస్టులకు అప్‌గ్రేడ్ నిర్ణయం తీసుకోనున్నారు. విద్యుత్, జలవనరుల శాఖలకు సంబంధించిన పనులకు, అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పొగాకు రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలుపనున్నారు. అలాగే జడ్జిలకు ఏడుగురు డ్రైవర్లను కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. నూర్ బాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ మార్పు అంశంపై కేబినెట్ చర్చించనుంది.