రష్యాలో ఫార్ఈస్టర్న్ అమూర్ ప్రాంతంలో గల్లంతైన ఓ ప్రయాణికుల విమానం మంటల్లో కాలిపోతూ ఉండగా రెస్క్యూ హెలికాప్టర్ దానిని గుర్తించింది. ఈ ఘటన జులై 24, 2025 గురువారం చోటుచేసుకుంది.
ఇంటర్‌ఫాక్స్ మరియు SHOT వార్తా సంస్థల ప్రకారం, రష్యా ఫార్ తూర్పు ప్రాంతంలో ప్రయాణిస్తున్న AN-24 అనే ప్రయాణికుల విమానం గురువారం దిశ తప్పిపోయింది. సుమారు 50 మంది ప్రయాణికులతో కూడిన ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC తో సంబంధాన్ని కోల్పోయింది.
ఈ విమానం అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఇది చైనా సరిహద్దున ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా అనే పట్టణానికి వెళ్తుండగా, గమ్యస్థానానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ATCతో సంబంధం తెగిపోయింది.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించిన రెస్క్యూ బృందం, హెలికాప్టర్ సహాయంతో శోధన చేపట్టి, చివరకు మంటల్లో కాలిపోతున్న విమానాన్ని గుర్తించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రయాణికుల పరిస్థితి, ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారుల విచారణ కొనసాగుతోంది.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధికార వర్గాలు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.