ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల, మండలాల, జిల్లాల పేర్లు మరియు సరిహద్దులు మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ రెండు రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏడు మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి వచ్చే వినతులు, వివిధ వర్గాల అభిప్రాయాల ఆధారంగా కమిటీ పేర్ల మార్పుపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉండగా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్నారు.
ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ఊర్ల ప్రజలు వారి గ్రామాల పేర్ల మార్పుపై డిమాండ్లు పెంచుతున్నారు. 'పెంట', 'పంది' లాంటి పదాలతో ఉండే గ్రామ పేర్లు స్థానికులను ఇబ్బందిపెట్టుతున్నాయని, అవి మార్చాలని పలువురు కోరుతున్నారు.
ఉదాహరణకు:
శ్రీశైలం సమీపంలో ఉన్న సున్నిపెంట
నెల్లూరు జిల్లా దగదర్తిలో చవటపుత్తేడు (మార్పు డిమాండ్ – 'బృందావనం')
కడపలో చీమలపెంట,
అన్నమయ్య జిల్లాలో కుక్కలదొడ్డి,
శ్రీసత్యసాయి జిల్లాలో గాండ్లపెంట,
తదితర గ్రామాలు
ఇక గ్రామాల పేర్లు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్లో భాగం కాబట్టి అవి మారకూడదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే పేరు మార్పు కోరేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి తమ వినతులు పంపించవచ్చు.
మొత్తం మీద ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల పేర్లు మార్చేందుకు ఎంతమంది ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.