తన నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. కార్యకర్తల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వారికి అండగా నిలవాలని తానే స్వయంగా ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.
నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో 175 మంది కార్యకర్తలకు రూ.45 లక్షల చెక్కులను తన సతీమణి రమాదేవితో కలిసి పంపిణీ చేశారు. ఐదేళ్లలో మొత్తం రూ.50 కోట్ల నిధిని కార్యకర్తల సంక్షేమానికి వినియోగిస్తానని స్పష్టం చేశారు.
“నా విజయానికి కారణమైన కార్యకర్తలకు బాసటగా ఉంటా. ఎప్పుడైనా వారికి అవసరమైతే 24 గంటలూ అందుబాటులో ఉంటాను,” అని నారాయణ చెప్పారు.
నెల్లూరులో సమగ్ర అభివృద్ధి కోసం పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇకపై స్వీపింగ్ యంత్రాలతో వీధులు శుభ్రపరుస్తామని వెల్లడించారు. ఇప్పటికే 28 యంత్రాలు మున్సిపాలిటీకి అందించామని తెలిపారు. మరోవైపు, నెల్లూరులో 5 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం తన లక్ష్యమని స్పష్టం చేశారు.