ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత ప్రయాణానికి సంబంధించి బస్సుల ఎంపిక, మార్గదర్శకాలు, ప్రయాణికుల గణాంకాలు వంటి అనేక అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేసింది.
ఈ పథకం ద్వారా జిల్లాల పరిమితి లోపల మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు మరియు నగరాలలోని సిటీ బస్సులపై ఉచిత ప్రయాణం లభ్యం కానుంది. ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం 91.5% మంది ప్రయాణికులు తమ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ప్రయాణిస్తుండటంతో ఈ ప్రణాళికను అదే ఆధారంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో 8,458 బస్సులు (పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ బస్సులు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్) ఉమ్మడి జిల్లాలలోనే తిరుగుతున్నాయి. ఈ పథకం అమలుతో రోజుకి సగటున 16.11 లక్షల మహిళలు ప్రయాణిస్తున్న సంఖ్య 26.95 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఆర్టీసీపై నెలకు రూ. 242 కోట్ల భారం పడే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల, ఇంకా కొన్ని మిగిలిన అంశాలపై చర్చలు పూర్తయ్యాక అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. పథకం అమలులో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం మరిన్ని మార్గాలు పరిశీలిస్తోంది.
 
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        