ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో బహుళ మౌలిక సదుపాయాల కలిగిన భారీ పరిశ్రమ రాబోతోంది. కడప జిల్లాలోని సున్నపురాళ్ల పల్లెలో Integrated Steel Plant ఏర్పాటు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ రూపొందించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదటి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించి, రెండో దశలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో విస్తరణ చేపట్టాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది.
ఈ పరిశ్రమకు అవసరమైన విద్యుత్, నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. రూ. 5 లక్షల చొప్పున మొత్తం 1100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 2026 జనవరి నాటికి మొదటి దశ పనులు ప్రారంభించి, 2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి మొదలు పెట్టాలని నిర్దేశించింది. Production timeline తో పాటు సంస్థకు పరిశ్రమల అభివృద్ధి విధానానికి అనుగుణంగా ప్రోత్సాహాలు ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
2031 జనవరిలో రెండో దశ పనులు ప్రారంభించి, 2034 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జేఎస్‌డబ్ల్యూ సంస్థ తెలిపింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి వై. యువరాజ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో రాయలసీమ ప్రాంతానికి ఒక పునర్జీవం లభించబోతోంది. ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి బహుళ లాభాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. మౌలిక సదుపాయాలు, ఉపాధి, టెక్నాలజీ పరిజ్ఞానం విస్తరణ ఇలా అనేక రంగాల్లో ఇది కీలక మార్గదర్శకంగా నిలవనుంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        