తెలంగాణలో ఇళ్ల కలను నిజం చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు దశలవారీగా రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఇల్లు పునాదివరకు నిర్మించిన తర్వాత మొదటి విడతగా రూ. 1 లక్ష వారి ఖాతాల్లో జమ అవుతుంది.
అయితే, కొందరు లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పునాది కూడా నిర్మించలేకపోతున్నారు. అటువంటివారి కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్వాక్రా సంఘాల ద్వారా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణం అందించేందుకు చర్యలు తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో అప్పుల్లేని సభ్యులు బ్యాంక్ లింకేజీ, సీఐఎఫ్ (Community Investment Fund), శ్రీనిధి వనరుల ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు.
ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు అయ్యాయి. దీంతో వారు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం వల్ల తమ కలల ఇల్లు త్వరగా పూర్తవుతుందన్న ఆశను లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.