గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన రేషన్ మాఫియా చేతిలో బర్నబాసు హత్య కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు.
సీఐడీ అధికారులు రోశయ్యను రాబోయే మంగళవారం అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నించనున్నట్లు సమాచారం. బర్నబాసు హత్య వెనుక కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో ఆధారాలు లభించాయని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీఐడీ, కొన్ని ప్రధాన అంశాలపై రోశయ్య వివరణ అవసరమని భావించింది. బర్నబాసు హత్యతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, న్యాయం జరగాలని బాధిత కుటుంబం, ప్రజాసంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చాయి.
ఈ పరిణామంపై పొన్నూరు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.