ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన నగరాలు –విశాఖపట్నం మరియు విజయవాడ– త్వరలోనే అంతర్జాతీయ స్థాయి లులు మాల్స్ ను కలిగి ఉండబోతున్నాయి. ఈ మాల్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. విశాఖలో బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ ప్రాంతంలో 13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు లులు గ్రూప్‌కు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో మాల్‌ను నిర్మించనున్నారు.
ఈ లులు మాల్స్‌లో లులుసూపర్ మార్కెట్, ఫ్యాషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ సెంటర్, లులు కనెక్ట్ వంటి ఆధునిక వాణిజ్య వసతులు ఉంటాయి. విశాఖలో నిర్మించబోయే మాల్ విస్తీర్ణం 13.5 లక్షల చదరపు అడుగులుగా ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రత్యేక కేటగిరీ ప్రాజెక్టులుగా పరిగణిస్తూ మొదటి మూడు సంవత్సరాల పాటు లీజు మాఫీ వర్తింపజేస్తోంది. భూముల ధరలను 2024–29 పర్యాటక విధానానికి అనుగుణంగా నిర్ణయించనున్నారు.
విజయవాడలో భూమి కేటాయింపుతో పాటు ఆ ఆర్టీసీ భవనాలను వేరే చోటికి తరలించేందుకు అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఆర్టీసీకి భూమిని కేటాయించి ప్రాజెక్ట్ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించనున్నారు. భవిష్యత్తులో కోర్టు కేసులు తలెత్తకుండా చూసేందుకు APIIIC, రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోనున్నాయి.
ఈ రెండు మాల్స్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యతను పరిశ్రమలు, వాణిజ్య శాఖ, APIIIC చేపట్టనున్నాయి. ప్రాజెక్టులను నిర్ణీత గడువులోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. మాల్స్‌తో పాటు రెస్టారెంట్లు వంటి వాణిజ్య, పర్యాటక ప్రాజెక్టుల్ని కూడా భూకేటాయింపు విధాన పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.