ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి పీయూసీ ప్రవేశాల కోసం జరిగిన రెండు విడతల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయి. మొత్తం 4,400 సీట్లకు గానూ 4,072 సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 67.85 శాతం అంటే 2,763 సీట్లను బాలికలు ఆక్రమించారు. కేవలం 1,309 మంది అబ్బాయిలే ప్రవేశం పొందారు.
ట్రిపుల్ ఐటీల చరిత్రలో ఇదే తొలిసారి బాలికలు ఈ స్థాయిలో అధిక సంఖ్యలో ప్రవేశాలు సాధించడం గమనార్హం. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ప్రవేశాలు నిర్వహించబడుతున్నాయి. బాలికల రేటు పెరగడంతో, నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వసతిగృహ అవసరాల నిమిత్తం ఒక పరిపాలన భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.