తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు మరో శుభవార్త. పథకం కింద ఇళ్లు మంజూరైన డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాన్ని ప్రభుత్వం అందించనుంది. పేదలకు ఆశ్రయాన్ని కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకంలో లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ రుణాలు మంజూరయ్యాయని వెల్లడించారు.
మొదటి విడతలో లక్షల ఇళ్లు
ఈ పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 ఇళ్లను మంజూరు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు. ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వం మొత్తం రూ.5 లక్షల నిధిని విడతలవారీగా అందిస్తోంది. పునాది దశ పూర్తి చేసిన తర్వాత మొదటి విడతగా రూ.1 లక్ష విడుదల చేస్తారు.
డ్వాక్రా సభ్యులకు ప్రత్యేక రుణ సాయం
అయితే, ఇళ్లు మంజూరు అయినా పునాది నిర్మాణానికి అవసరమైన మొదటి ఖర్చును భరించలేని పేద కుటుంబాలు చాలా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, అలాంటి కుటుంబాల్లోకి చెందిన మహిళలు స్వయం సహాయక సంఘాలకు సభ్యులై ఉంటే, వారి కోసం ప్రత్యేకంగా రూ.1 – రూ.2 లక్షల రుణం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఈ రుణ సదుపాయంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి పథకం కింద ప్రభుత్వం ఇవ్వనున్న నిధులను అందుకోవచ్చని అధికారులు తెలిపారు.