గత ఎన్నికల ప్రచార సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గులకరాయి విసిరిన ఘటన మరువకముందే, ఆ కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. విజయవాడలోని తన ఇంటి నుంచి జులై 18న సతీష్ గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చివరకు జులై 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, సతీష్ కడపలో కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అతను ఎందుకు పారిపోయాడన్న అంశంపై పోలీసుల దర్యాప్తు సాగింది. దీనికి సంబంధించి అతని ఇంట్లో తల్లిదండ్రుల తో జరిగిన మనస్పర్థలే కారణమని గుర్తించారు. ప్రేమ వ్యవహారంపై కుటుంబ సభ్యుల భిన్నాభిప్రాయాలే ఇతడి నడక మార్చినట్లు తేలింది.
ఇదిలా ఉండగా, గతంలో ఏప్రిల్ 13, 2024న జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనపై రాయి విసిరి గాయపరిచిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడిలో జగన్ కంటికి సమీపంలో గాయం కాగా, పక్కనే ఉన్న అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి కూడా గాయాలయ్యాయి. ఈ కేసులో సతీష్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
ఇప్పుడిలా సతీష్ అదృశ్యమై తిరిగి బయటపడటంతో ఈ వ్యవహారంలో ఎలాంటి రాజకీయ కోణముందా? అనే అనుమానాలు కూడా మిగిలిపోయాయి. అయితే ప్రస్తుతానికి కుటుంబసభ్యులకు అప్పగించడం, ప్రేమ వ్యవహారం కారణంగా పారిపోయాడన్న స్పష్టత రావడంతో ఈ కేసు తాత్కాలికంగా ముగిసినట్లు కనిపిస్తోంది.