ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రక అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి ‘ప్యూర్ వేగన్’ ఎలక్ట్రిక్ కారును సంస్థ అధికారికంగా ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన CES 2026 ప్రదర్శనలో, తన ప్రముఖ మోడల్ GLC యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు జంతు సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కారు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేపుతోంది.
ఈ కారుకు ప్రధాన ప్రత్యేకత పూర్తిగా వేగన్ ఇంటీరియర్. సాధారణంగా లగ్జరీ కార్లలో సీట్లు, స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ కోసం జంతు చర్మాన్ని ఉపయోగిస్తారు. కానీ ఈ GLC ఎలక్ట్రిక్ కారులో ఎక్కడా జంతువుల ఉత్పత్తులు వాడలేదు. సీట్లు, కార్పెట్లు, స్టీరింగ్ వీల్ అన్నీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వేగన్ మెటీరియల్‌తో తయారు చేశారు. వేగన్ సొసైటీతో కలిసి దాదాపు రెండు సంవత్సరాలపాటు పరిశోధనలు చేసి, 100కు పైగా భాగాలను పూర్తిగా యానిమల్-ఫ్రీగా రూపొందించినట్లు మెర్సిడెస్ వెల్లడించింది.
పర్యావరణ హితత్వాన్ని మరింత బలపరిచేలా ఈ కారులో రీసైకిల్ చేయగల పదార్థాలను విస్తృతంగా ఉపయోగించారు. ముఖ్యంగా ఎలాంటి భాగాన్నీ జంతువులపై పరీక్షించకుండా తయారు చేయడం మరో విశేషం. దీంతో ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ వాహనంగా మాత్రమే కాకుండా, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది.
పర్ఫార్మెన్స్ విషయంలోనూ ఈ కారు అద్భుతంగా నిలుస్తోంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 483 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తూ గంటకు 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 713 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉంది. 330 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే 300 కిలోమీటర్లకు సరిపడా ఛార్జ్ పొందడం ఈ కారుకు మరో ప్రధాన బలం.
టెక్నాలజీ పరంగా కూడా ఈ కారు ముందంజలో ఉంది. డ్యాష్‌బోర్డ్ అంతటా విస్తరించిన 39.1 అంగుళాల భారీ స్క్రీన్, మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ AI కలిసి పనిచేసే వ్యవస్థ, లెవల్-2 ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అమెరికాలో 2026 రెండో త్రైమాసికం నుంచి అమ్మకాలు ప్రారంభం కానుండగా, వినియోగదారులు కంపెనీ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన విధంగా వేగన్ ఇంటీరియర్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.