కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన నిర్ణయంపై దృష్టి సారించింది విదేశాల్లో స్థిరపడిన భారతీయ మూలాల ప్రతిభను మళ్లీ స్వదేశానికి తీసుకురావాలనే యోచనలో ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడిన భారత సంతతి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఫ్యాకల్టీ సభ్యులు, నిపుణులను భారతదేశానికి రప్పించాలనే ఆలోచనతో కేంద్రం ముందుకెళ్తోంది. దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ ప్రమాణాల రీసెర్చ్ వాతావరణాన్ని పెంచడం, విద్యా రంగంలో గ్లోబల్ లెవెల్లో పోటీ చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, IITలు, IISc, IISERలు, NITలు వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో విదేశీ భారత సంతతి నిపుణులకు ఫ్యాకల్టీ స్థానాలు, రీసెర్చ్ ప్రాజెక్టులు, ల్యాబ్ లీడర్షిప్ రోల్స్ ఇవ్వాలన్న ప్రణాళిక తయారవుతోంది. దీనికోసం ప్రత్యేక స్కీమ్ రూపకల్పన దశలో ఉందని తెలుస్తోంది. “Brain Gain” అనే కాన్సెప్ట్‌ను కేంద్రం ముందుకు తెస్తోంది అంటే ఇప్పటివరకు "Brain Drain" (దేశం నుంచి మేధావుల వలస) జరిగిందని చెబుతుండగా, ఇప్పుడు ఆ ప్రతిభను తిరిగి దేశానికి తేవడం లక్ష్యంగా ఉంది.
ప్రధానంగా అమెరికాలో ట్రంప్ పరిపాలనలోని వలస విధానాలు (Immigration Policies) కఠినతరం అవుతున్న నేపథ్యంలో, చాలా మంది భారత సంతతి పరిశోధకులు, ప్రొఫెసర్లు అమెరికాలో కొనసాగడంపై అనిశ్చితి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారికి భారతదేశంలోనే మంచి అవకాశాలు కల్పిస్తే, మేధావుల వలసను తిరిగి స్వదేశానికి మళ్లించవచ్చని కేంద్రం భావిస్తోంది.
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతున్నట్లు సమాచారం. ఈ కమిటీ విదేశాల్లోని భారతీయ మూలాల ప్రతిభావంతుల జాబితా సేకరించి, వారి నైపుణ్యాలకు సరిపోయే పోస్టులను గుర్తించనుంది. అలాగే వారికి ఆకర్షణీయమైన వేతనాలు, పరిశోధన నిధులు, గృహ వసతి, పిల్లల విద్యా సదుపాయాలు వంటి ప్రోత్సాహక ప్యాకేజీలు అందించే అవకాశం ఉందని వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో పరిశోధన స్థాయి, అంతర్జాతీయ సహకారం, గ్లోబల్ ర్యాంకింగ్స్ వంటి అంశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నందున, విదేశీ అనుభవం కలిగిన నిపుణులను తిరిగి తెచ్చుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
నిపుణుల ప్రకారం, ఈ నిర్ణయం దేశానికి ఎంతో మేలు చేస్తుంది. “విదేశాల్లో ఉన్న భారతీయులు చాలా మందికి విశేష అనుభవం ఉంది. వారిని తిరిగి ఇక్కడికి రప్పించి IITలు, IISc లాంటి సంస్థల్లో బోధన, పరిశోధనలో పాల్గొనిస్తే భారత విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది” అని విద్యావేత్తలు అంటున్నారు. కేంద్రం ఈ ప్రణాళికను త్వరలో అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. మొదటిగా పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొన్ని IITలలో ఈ స్కీమ్‌ను ప్రారంభించే అవకాశముంది.