ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, గ్రామీణ యువతకు ఇప్పుడు స్వయం ఉపాధి దిశగా బంగారు అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇప్పుడు కేవలం ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి సారించాయి. అందులో భాగంగా, తక్కువ పెట్టుబడితో, స్థిరమైన ఆదాయం ఇచ్చే తేనెటీగల పెంపకం (Bee Keeping) పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు, రైతులు కూడా అదనపు ఆదాయం పొందే మార్గం సుగమమవుతోంది.
తేనెటీగల పెంపకంలో ఆసక్తి ఉన్న వారు ముందుగా ఈ రంగంలో శిక్షణ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) పథకం కింద రాయితీలు పొందాలంటే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఇందుకోసం ఎమ్మిగనూరులోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో వారం రోజుల శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఈ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్, బ్యాంక్ ఖాతా వంటి అవసరమైన పత్రాలతో సమీప హార్టికల్చర్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తే, తేనె ఉత్పత్తికి అవసరమైన ఈగలు, బాక్సులు రాయితీపై అందిస్తారు.
తేనెటీగల పెంపకం కోసం అధిక పెట్టుబడి అవసరం లేదు. ఒక యూనిట్ (బాక్స్ + స్టాండ్ + ఈగలు) ధర రూ.4,000 మాత్రమే. అందులో 40 శాతం రాయితీగా రూ.1,600 ప్రభుత్వమే భరిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 50 యూనిట్లు పొందవచ్చు. అలాగే తేనె తీసే యంత్రం (ఎక్స్ట్రాక్టర్) ధర రూ.20,000 కాగా, దానిపై కూడా 40 శాతం రాయితీ లభిస్తుంది. అంటే, తక్కువ ఖర్చుతోనే పెద్ద స్థాయిలో తేనె ఉత్పత్తి ప్రారంభించే అవకాశం లభిస్తోంది. ఇది నిరుద్యోగులకు, చిన్న రైతులకు ఆర్థిక భద్రతను అందించే స్థిరమైన వ్యాపార మార్గం.
తేనెటీగల పెంపకానికి సొంత భూమి అవసరం లేదు. పుష్పించే పంటల దగ్గర, అంటే నువ్వులు, పొద్దుతిరుగుడు, వాము, కంది వంటి పంటల వద్ద బాక్సులను ఏర్పాటు చేయవచ్చు. ఈ పంటల్లో రసాయనాలు తక్కువగా ఉండటం వల్ల తేనెటీగలకు అనుకూల వాతావరణం లభిస్తుంది. సుమారు 20 రోజుల్లో తేనె ఉత్పత్తి మొదలవుతుంది. మరో 10 రోజుల్లో నాణ్యమైన తేనె సిద్ధమవుతుంది. ఒక్క బాక్స్ నుంచే 3–4 కిలోల తేనె వస్తుంది. మార్కెట్లో తేనె కిలో రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముడవుతుంది. అంటే చిన్న స్థాయిలో ప్రారంభించినా నెలకు వేలు వేలు ఆదాయం సాధ్యమే.