Politics-ఏపీ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి…
ఏపీలో పర్యాటక రంగంపై ఎన్నారైల కన్ను…
విదేశీ వేదికలపై తెలుగు జెండా…
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల అభిప్రాయాలను స్వయంగా వినడంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి సచివాలయంలో అమెరికా, కెనడా, ఒమన్, కువైట్ దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశాన్ని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు.
విదేశాల నుంచి వచ్చిన అతిథులను సీఎం ఆత్మీయంగా పలకరించి, వారి కుటుంబాలు, వృత్తులు, వారు నివసిస్తున్న దేశాల్లో పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ భేటీలో అమెరికా నుండి వేణుగోపాల్, కెనడా నుండి రాంబాబు, రమేశ్, యశ్వంత్, కువైట్ నుండి శ్రీనివాసరావు, ఒమన్ నుండి అనిల్ కుమార్ అలాగే యూకే నుండి సందీప్ శ్రావణి పాల్గొన్నారు.
ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులు ప్రస్తుత యుద్ద సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఒమన్ నుండి వచ్చిన అనిల్ కుమార్, కువైట్ నుండి శ్రీనివాసరావు వివరించారు. అదేవిధంగా ఏజెంట్ల మోసాలు, ఎంబసీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు, కార్మికులు పడుతున్న ఇబ్బందులను వారు సీఎంకు తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్‌కు సూచించారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తే మరింత మంది ముందుకు వస్తారని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న అవకాశాలను తెలుగు యువత సద్వినియోగం చేసుకునేలా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
వారి సూచనలకు స్పందించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలచిన ఎన్నారైలు స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారితో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం తమకు మరపురాని అనుభవమని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీతో ప్రభుత్వం-ప్రవాసాంధ్రుల మధ్య బంధం మరింత బలపడిందని వారు అభిప్రాయపడ్డారు.