ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ అంశానికి సంబంధించిన ఫైల్‌కు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. న్యాయశాఖ, పట్టణాభివృద్ధిశాఖతో పాటు మరో రెండు కేంద్ర శాఖల అభిప్రాయాలు పూర్తిగా సేకరించిన అనంతరం అమరావతి రాజధాని బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ ఆమోదం లభిస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అమరావతికి శాశ్వత రాజధాని హోదా దిశగా లైన్ క్లియర్ అయినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ నిబంధనల మేరకు 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, భూమి పూజతో పాటు శంకుస్థాపన కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే తరువాత జరిగిన రాజకీయ మార్పులతో అమరావతి అభివృద్ధి ప్రక్రియకు బ్రేక్ పడింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజధానిపై తీవ్ర గందరగోళం నెలకొంది.
మళ్లీ 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని అంశం తిరిగి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కోరింది. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ టీడీపీ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగగా, ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక శాశ్వత రాజధానిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ అమరావతి రాజధాని బిల్లుపై చర్యలు ప్రారంభించింది. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో ఏర్పడిన గందరగోళానికి శాశ్వత పరిష్కారం కావాలంటే పార్లమెంట్ చట్టబద్ధత తప్పనిసరని ఎన్డీయే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల్లో పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం లాంఛనమేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు వైసీపీ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.