Viksit Bharat 2047 Climate: భారతదేశం వాతావరణ మార్పులపై మరింత ఉధృతం చేస్తూ సరికొత్త లక్ష్యాలను ప్రకటించింది. 2035 నాటికి ఉద్గారాలను భారీగా తగ్గించడంతో పాటు, పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక ఆమోదం తెలిపింది.
పర్యావరణ పరిరక్షణలో భారత్ కొత్త అడుగు
ప్రపంచ దేశాల మధ్య కుదిరిన పారిస్ ఒప్పందం ప్రకారం, ప్రతి ఐదేళ్లకోసారి దేశాలు తమ పర్యావరణ లక్ష్యాలను పునఃసమీక్షించుకోవాలి. ఇందులో భాగంగా భారత్ తన పాత లక్ష్యాలను మరింత కఠినతరం చేస్తూ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే పదేళ్లలో దేశం అనుసరించబోయే వ్యూహాలివే.
ఉద్గారాల తగ్గింపు
2035 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి కంటే 47 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే పరిశ్రమలు, రవాణా రంగాల నుండి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.
పునరుత్పాదక ఇంధనం
విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, 60 శాతం విద్యుత్తును సౌర, పవన ఇతర పర్యావరణ అనుకూల మార్గాల ద్వారానే పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కార్బన్ సింక్
వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు అడవుల విస్తీర్ణం పెంచాలని భారత్ భావిస్తోంది. 2035 నాటికి దాదాపు 3.5 నుండి 4.0 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించగలిగేలా చెట్లను పెంచడం ఈ ప్రణాళికలో మరో ముఖ్య భాగం.
గత విజయాల స్ఫూర్తితో..
భారతదేశం గతంలో పెట్టుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేయడం గమనార్హం. 2005 నుండి 2020 మధ్య కాలంలోనే ఉద్గారాల తీవ్రతను 36 శాతం మేర తగ్గించగలిగింది. అలాగే, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 52 శాతం శిలాజ రహిత వనరుల నుండే వస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఈ కొత్త లక్ష్యాలను కేవలం ఆశయాలుగా కాకుండా, కచ్చితంగా అమలు చేయగల వాస్తవ ప్రణాళికలుగా అభివర్ణించింది.
ఈ లక్ష్యాలను సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ఉ త్పత్తి, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ పర్యావరణ అనుకూల పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించనున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం ఈ గ్లోబల్ వార్మింగ్ పోరాటంలో అగ్రగామిగా నిలవాలని చూస్తోంది. 2070 నాటికి 'నెట్ జీరో' సాధించాలనే భారతదేశ దీర్ఘకాలిక కల దిశగా ఇదొక అతిపెద్ద ముందడుగు అని నిపుణులు భావిస్తున్నారు.