వంట గ్యాస్ ధరలు ప్రతి కుటుంబం ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే అంశం. ప్రతి నెల మొదటి తేదీకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను సమీక్షించి కొత్త రేట్లను ప్రకటిస్తాయి. నవంబర్ నెలకు సంబంధించిన తాజా ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈసారి గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. అయితే కమర్షియల్ వాడకానికి ఉన్న 19 కిలోల సిలిండర్ ధరలో కొద్దిగా తగ్గింపు వచ్చింది. ఐదు రూపాయల వరకు తగ్గించడంతో, రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వ్యాపార రంగాలకు స్వల్ప ఉపశమనంగా మారింది.
ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,590.50, కాగా గత నెలలో ఇది రూ.1,595.50గా ఉంది. కోల్కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542,
చెన్నైలో రూ.1,750, హైదరాబాద్లో రూ.1,812.50 విజయవాడ రూ.1,810.50 గా కొత్త రేట్లు నమోదయ్యాయి.
మరోవైపు గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ ధరలు పాత రేట్లలోనే కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధరలు రూ.850 నుంచి రూ.960 మధ్య ఉన్నాయి.
ఢిల్లీలో రూ.853
ముంబైలో రూ.852.50
హైదరాబాద్లో రూ.905
ఆంధ్ర ప్రదేశ్ లో రూ 877.50
గత కొద్ది నెలలుగా వంట గ్యాస్ ధరల్లో పెద్ద మార్పు లేకపోవడం వినియోగదారులకు కొంత ఊరటను కలిగిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో రాబోయే నెలల్లో మరిన్ని సవరణలు చేసే అవకాశం ఉంది.
కానీ ప్రభుత్వం ఎప్పుడు ధరలను పెంచినా తగ్గించినా, అది నేరుగా సామాన్యుల జీవనవ్యయంపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి నెల గ్యాస్ ధరల అప్డేట్స్పై ప్రజలు ఆసక్తిగా చూస్తుంటారు.
సాధారణ కుటుంబాలకు పెద్దగా ఉపశమనమేమీ లభించకపోయినా కమర్షియల్ రంగానికి ఈ తగ్గింపు కొంత ఊరట కలిగిస్తుంది. గృహ సిలిండర్ ధరలు కూడా త్వరలో తగ్గుతాయనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు