భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి హ్యుందాయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూకు స్పోర్టీ టచ్ ఇచ్చి, కంపెనీ కొత్త వెర్షన్ వెన్యూ ఎన్ లైన్ను ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో షోరూమ్‌ల వద్ద లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. నవంబర్ 4న అధికారికంగా లాంచ్ కానున్న ఈ మోడల్‌పై కార్ లవర్స్, యువతలో ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది.
స్టాండర్డ్ వెన్యూ కంటే ఈ ఎన్ లైన్ వెర్షన్‌లో అనేక విజువల్ అప్‌డేట్లు చేశారు. ఫ్రంట్ మరియు రియర్ బంపర్లపై రెడ్ యాక్సెంట్స్, 17-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, స్పోర్టీ వింగ్ స్టైల్ స్పాయిలర్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ అన్ని కలిపి ఈ మోడల్‌కు ధైర్యమైన, స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. మొత్తం ఎనిమిది సింగిల్ టోన్, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది. కారు ఇంటీరియర్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. బ్లాక్ థీమ్ ఇంటీరియర్‌లో చోటుచోటు రెడ్ హైలైట్స్, మెటల్ పెడల్స్, ఎన్ బ్రాండింగ్, ప్రీమియం ఫినిషింగ్ అన్ని కలిపి డ్రైవర్‌కు రేసింగ్ ఫీల్ ఇస్తాయి. ఈ డిజైన్ కొత్త తరానికి, యంగ్ బాయర్లకు బాగా నచ్చేలా రూపొందించారు.
వెన్యూ ఎన్ లైన్‌లో హ్యుందాయ్ ప్రీమియం టెక్నాలజీలను సమీకరించింది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ నావిగేషన్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు సరోండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్ వంటి సిస్టమ్స్ కూడా అందించారు. భద్రత పరంగా హ్యుందాయ్ పెద్ద ఎత్తున మెరుగుదల చేసింది. ADAS లెవెల్ 2 టెక్నాలజీ కింద మొత్తం 21 డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్లు ఉన్నాయి. వీటిలో లేన్ కీప్ అసిస్టెంట్, ఆటో బ్రేక్, ఫ్రంట్ కొల్లిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ప్రధానమైనవి. కంపెనీ మొత్తం 70కి పైగా సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిపింది.
వెన్యూ ఎన్ లైన్‌లో 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 120 హార్స్ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) ఆప్షన్లు లభిస్తాయి. ఆటోమేటిక్ వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్ల సౌకర్యం కూడా ఉంది. రోడ్ మీద ఈ కారు అందించే స్మూత్ రైడ్, శక్తివంతమైన యాక్సిలరేషన్ యువతను ఆకర్షించనుంది. హ్యుందాయ్ ప్రతి మోడల్‌లో వినియోగదారుల అంచనాలను మించే అప్‌గ్రేడ్స్ అందిస్తోంది. ఈ కొత్త వెన్యూ ఎన్ లైన్ ఆ జాబితాలో మరో అద్భుతం అవుతుందని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.