ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా నిందితుల ఆస్తులపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్ వివరణాత్మకంగా సమర్పించిన నివేదిక ఆధారంగా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి తెలిపింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులుగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య లక్ష్మీ పేర్లపై నమోదైన ఆస్తులన్నిటిని జప్తు చేయాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్ రెడ్డికి చెందిన ఆస్తులను కూడా ఇదే కేసులో భాగంగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. సిట్ దర్యాప్తు ప్రకారం చెవిరెడ్డి కుటుంబం గత కొన్నేళ్లలో అక్రమ ఆదాయాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ముఖ్యంగా మద్యం కేటాయింపుల్లో చెలామణిలో జరిగిన అవకతవకలకు సంబంధించి పెద్దఎత్తున కమీషన్లు తీసుకున్నారని, ఆ కమీషన్ల ద్వారానే కుటుంబం అనేక భూములు, ఇళ్లు, కమర్షియల్ ప్రాపర్టీలను సేకరించిందని సిట్ తమ నివేదికలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో సిట్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియలను పూర్తిచేసి ఆస్తుల జప్తుకు తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో సిట్ సూచించిన భూములు, బ్యాంక్ ఖాతాలు, ఇళ్ళు, వాణిజ్య ఆస్తులు, ఇతర విలువైన ఆస్తులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశముంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ విభాగాలు ఈ ఆస్తులపై వివరాలను సేకరించినన్నారు.
మద్యం స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. రాజకీయంగా కూడా ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రారంభం కావడంతో కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. అవినీతి, అక్రమ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే సంకేతాన్ని ఈ పరిణామం ఇస్తోంది. ఇకపై సిట్ దర్యాప్తు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.