2026 మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ బదిలీలు అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ బదిలీల్లో ప్రధానంగా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు, అలాగే ఒకేచోట సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్ కమిషనర్లను గుర్తించి మార్పులు చేశారు. ఎన్నికల సమయంలో అధికారులపై రాజకీయ ప్రభావం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జీహెచ్ఎంసీ పరిధితో పాటు, రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ బదిలీలు వర్తిస్తాయి.
పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సి.వి.ఎన్. రాజు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) పదవి నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అలాగే జి. రాజు క్యాతనపల్లి నుంచి ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ముసాబ్ అహ్మద్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా, బి. శ్రీనివాస్ ఆలేరు నుంచి హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. మరోవైపు బి. శరత్ చంద్ర పదోన్నతిపై నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త ప్రాంతాల్లో విధులు స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పరిపాలన వ్యవస్థ పూర్తిగా ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బదిలీలతో మున్సిపల్ స్థాయిలో పరిపాలన మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.