బ్యాంకింగ్ రంగంలో నవంబర్ 1 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు ఎంతో కీలకంగా ఉండనున్నాయి. ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల్లోని కొన్ని సెక్షన్లను సవరించింది. ఈ మార్పులతో నామినేషన్ ప్రక్రియ, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్, సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ మరియు లాకర్ల భద్రతకు సంబంధించి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మార్పులు డిపాజిటర్ల హక్కులను మరింత రక్షించడమే లక్ష్యంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఒక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌కి ఒకే వ్యక్తిని నామినీగా పెట్టుకునే అవకాశం ఉండేది. అయితే నవంబర్ 1 నుంచి ఒక అకౌంట్‌కు నలుగురి వరకు నామినీలను నమోదు చేసుకోవచ్చు. వీటిని ఒకేసారి (Simultaneous) లేదా వరుసగా (Successive) చేయవచ్చు. ఒకేసారి నామినీలు ఉంటే, ప్రతి ఒక్కరి షేర్ ముందుగానే నిర్ణయించాలి. ఈ మార్పు వల్ల క్లెయిమ్ ప్రక్రియ సులభం అవుతుంది, అలాగే వివాదాలు తగ్గుతాయి.
బ్యాంక్ లాకర్లు, సేఫ్ కస్టడీకి సంబంధించిన నిబంధనలు కూడా మారనున్నాయి. ఇప్పటి నుంచి మొదటి నామినీకి ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ మొదటి నామినీ లేని పరిస్థితిలో, రెండవ నామినీ ఆటోమేటిక్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది డిపాజిటర్ల ఆస్తులకు అదనపు రక్షణ కల్పిస్తుంది. దీని వల్ల లాకర్లకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి.
నామినేషన్ ఫైల్ చేసే సమయంలో ప్రతి నామినీకి నిర్దిష్ట శాతం (percentage) లేదా షేర్ కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం షేర్ 100 శాతం మించకూడదు. ఇది డిపాజిట్లు లేదా ఆస్తుల పంపిణీలో స్పష్టతను తీసుకువస్తుంది. కొత్త నిబంధనల వల్ల బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.
ఈ మార్పులు “బ్యాంకింగ్ కంపెనీస్ (నామినేషన్) రూల్స్ - 2025” ప్రకారం అమలు కానున్నాయి. అన్ని బ్యాంకుల్లో నామినేషన్ క్రియేట్ చేయడం, రద్దు చేయడం లేదా మార్చడం ఇప్పుడు సులభం అవుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకారం, చట్టంలోని 10, 11, 12, 13 సెక్షన్లలో సవరణలు జరిగాయి. ఇవి డిపాజిట్లు, లాకర్లు, సేఫ్ కస్టడీ మరియు నామినేషన్ విధానాలకు మరింత పారదర్శకత తీసుకురానున్నాయి.