బతుకుదెరువు కోసం గల్ఫ్ గడ్డపై అడుగుపెట్టిన ఒక వలసజీవి ఐదేళ్లుగా విగతజీవిగా, బహరేన్ శవాగారంలో 'గుర్తింపు' కోసం వేచిచూస్తున్నాడు. ఆయన కథ, ఆయన కుటుంబ కష్టం పగవాడికి కూడా రావద్దు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ 18 ఏళ్ల క్రితం 2007లో బహరేన్ వెళ్లి, అక్కడ వివిధ పనుల్లో జీవనోపాధి కోసం శ్రమించారు. ఓ దశలో కంపెనీ వదిలి అక్రమ వలసదారుడిగా మారినట్లు సమాచారం. మొదట్లో కుటుంబంతో సమాచార సంబంధాలు కొనసాగించినా, తరువాత పూర్తిగా సంబంధాన్ని కోల్పోయారు.
బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో... శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్ లో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది.
మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ సహాయం కోసం మంగళవారం (21.10.2025) హైదరాబాద్ లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నరేష్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సత్వార చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి), పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల ఊరు కలికోట, కథలాపూర్ మండలంలో కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదిరిచూస్తోంది, చివరికి ఇప్పుడు శవమై రాబోతున్నాడు.
ఈ ఆపద సమయంలో మెట్పల్లి కి చెందిన గల్ఫ్ కార్మిక హక్కుల కార్యకర్త బొక్కెనపల్లి నాగరాజు, సామాజిక సేవకులు మాడిశెట్టి నాగరాజు, మొరపు తేజ లు మృతుడి సోదరుడి ద్వారా ముఖ్యమంత్రికి దరఖాస్తు చేయించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి వారికి అండగా నిలిచారు. బహరేన్ లోని సోషల్ వర్కర్ కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.