Actor Suman Emotional Comments: టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన నటుడు సుమన్, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న జైలు శిక్ష ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఆనాటి చీకటి రోజులను తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఏ తప్పూ చేయకపోయినా ఆరు నెలల పాటు జైలు గోడల మధ్య ఉండాల్సి వచ్చిందని, అది తనకే కాకుండా తన తల్లికి కూడా తీరని వేదన మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరు మోసం చేశారో ఇప్పటికీ క్లారిటీ లేదని, కానీ ఆ కర్మను వారికే వదిలేస్తున్నానని సుమన్ పేర్కొన్నారు.
జైల్లో ఉన్న ఆ ఆరు నెలలు తన జీవితంలోనే అత్యంత భయానకమైన కాలమని సుమన్ గుర్తు చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా జైలు అధికారులు తనను రోజుకో సెల్‌కు మార్చేవారని, అక్కడ హంతకులు, నక్సలైట్ల మధ్య గడపాల్సి వచ్చేదని చెప్పారు. అయితే, ఆ ఖైదీలు కూడా తన పట్ల ఎంతో మర్యాదగా ఉండేవారని, తనకు సరైన ఆహారం అందుతోందో లేదో అని ఆరా తీసేవారని ఆయన వెల్లడించారు. అప్పట్లో కరుణానిధి గారు జోక్యం చేసుకుని తనను క్లోజ్డ్ సెల్ నుంచి సాధారణ సెల్‌కు మార్పించారని, జైల్లో ఉన్నవారంతా నేరగాళ్లు కాదని, కొందరు పరిస్థితుల ప్రభావంతో అక్కడకు వస్తారని సుమన్ అభిప్రాయపడ్డారు.
శిక్ష ముగించుకుని, కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు సమాజం తనను ఎలా చూస్తుందో అన్న ఆందోళన సుమన్లో ఉండేది. ఆ సమయంలో నటి సుమలత మంచు మోహన్ బాబు తన ఇంటికి వచ్చి ధైర్యం చెప్పడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు గారు ఒక పూలదండ తీసుకుని తన ఇంటి గేటు వద్దకు వచ్చారని, సుమన్ ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదని తల్లి చెప్పినా వినకుండా ఎదురుచూశారని తెలిపారు. లోపలికి వెళ్లాక, సుమన్‌కు ఆ దండ వేసి "భయపడకు.. నీ స్థానం నీకు ఉంటుంది, మళ్లీ సినిమాలు చేస్తావు" అని చెప్పిన మాటలు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని సుమన్ చెప్పారు.
మోహన్ బాబు గురించి ఇండస్ట్రీలో రకరకాల మాటలు వినిపిస్తుంటాయని, ఆయన కోపిష్టి అని అందరూ అంటుంటారని సుమన్ ప్రస్తావించారు. కానీ, తనకు మాత్రం ఆయన అంటే ఎనలేని గౌరవం ఉందని, ఆపదలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మరీ పరామర్శించినందుకు ఆయనకు పాదాభివందనం చేస్తానని ఎమోషనల్ అయ్యారు. ఆయనది ముక్కుసూటి మనస్తత్వమని, రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడినా అందులో ఒక న్యాయం ఉంటుందని సుమన్ వెనకేసుకొచ్చారు. తన పెళ్లికి కూడా మోహన్ బాబు వచ్చి ప్రత్యేకంగా దీవించారని, కష్టకాలంలో తోడున్న వారిని ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు.
ప్రస్తుతం సుమన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా గడుపుతున్నారు. భగవంతుడి మీద నమ్మకంతో మళ్లీ తన బండి ట్రాక్‌లోకి వచ్చిందని, గతాన్ని తలచుకుని ఇప్పుడు బాధపడటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక హీరోగా ఇండస్ట్రీని ఏలిన సుమన్, తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను ఇంత ఓపెన్‌గా పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న స్నేహితుడికి మోహన్ బాబు అందించిన సహకారాన్ని నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు