ప్రస్తుతం షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం వంటి పెట్టుబడి మార్గాలు ఎంతగానో ప్రజాదరణ పొందుతున్నా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) మాత్రం పెట్టుబడిదారులకి ఇప్పటికీ అత్యంత నమ్మదగిన ఆప్షన్‌గా కొనసాగుతున్నాయి. మార్కెట్ మార్పులకు ప్రభావితమయ్యే పెట్టుబడులతో పోలిస్తే, FDలు స్థిరమైన లాభాలను అందించడం, డబ్బు భద్రత పరంగా విశ్వసనీయంగా ఉండటం వీటికి ప్రధాన ఆకర్షణ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది బ్యాంకుల్లో కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తూ తమ భవిష్యత్తు అవసరాలకు ఈ ఆప్షన్‌ను ఉపయోగిస్తున్నారు.
సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి ఒకేసారి ఒక మొత్తాన్ని బ్యాంకులో ఉంచి, దానిపై నిర్ణీత వడ్డీ పొందే పెట్టుబడి పద్ధతి. చాలా బ్యాంకులు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధుల్లో డిపాజిట్లను స్వీకరిస్తాయి. డిపాజిట్ కాలం ఎక్కువైతే వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరం లేదా ఐదు సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేస్తే సాధారణంగా చిన్న కాల డిపాజిట్లతో పోలిస్తే అధిక వడ్డీ లభిస్తుంది.
ఇటీవల పలు బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రకటించాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై 8.20% వడ్డీ ఇస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై 8%, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 18 నెలల డిపాజిట్లపై 7.75%, బంధన్ బ్యాంక్ 2–3 సంవత్సరాల డిపాజిట్లపై 7.20%, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాంటి ప్రధాన బ్యాంకులు 5 సంవత్సరాల డిపాజిట్లపై 6.60% వడ్డీ ఇస్తున్నాయి. ఇవి సాధారణ కస్టమర్లకు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా 0.25% నుండి 0.50% వరకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
అయితే, పెట్టుబడి చేసే ముందు బ్యాంక్ రకం, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా SBI, HDFC, ICICI వంటి ప్రధాన వాణిజ్య బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కొంచెం తక్కువగా ఉన్నా, డిపాజిట్ భద్రత అత్యధికంగా ఉంటుంది. మరోవైపు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీని ఇస్తాయి కానీ, వాటిలో రిస్క్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే సహకార బ్యాంకుల్లో (Co-operative Banks) వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, భద్రత పరంగా కొంత జాగ్రత్త అవసరం. కనుక, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే పెట్టుబడిదారులు, దీర్ఘకాల భద్రతను ఆశించే రిటైర్డ్ వ్యక్తులు FDలను ఉత్తమమైన ఎంపికగా పరిగణిస్తున్నారు.