సిడ్నీలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల నేతలను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో భాగస్వాములుగా మారండి అని పిలుపునిచ్చారు.
లోకేష్ మాట్లాడుతూ ఈ నెల నవంబర్ 14 మరియు 15 తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే CII Partnership Summit (2025) లో పాల్గొనండి. ఈ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలను అన్వేషించే అద్భుతమైన అవకాశం ఉంటుంది అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ముందంజలో ఉందని ఆయన అన్నారు. మా రాష్ట్రం నేడు విజనరీ నాయకత్వం కింద ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పారదర్శక పాలన, సంస్కరణలు, మరియు వేగవంతమైన పరిపాలనతో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాం అని చెప్పారు.
గత 16 నెలల్లోనే రాష్ట్రానికి ₹10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని లోకేష్ వెల్లడించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో Speed of Doing Business ఎలా ఉందో చూపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉండటంతో అంతర్జాతీయ కంపెనీలు కూడా రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నాయని అన్నారు.
మా లక్ష్యం స్పష్టంగా ఉంది – ఆంధ్రప్రదేశ్‌ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. దీని కోసం మేము వేగంగా సుస్థిరంగా ముందుకు సాగుతున్నాం. ప్రజల భాగస్వామ్యంతో పెట్టుబడిదారుల నమ్మకంతో ఈ మార్పు సాధ్యమవుతుంది అని లోకేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వంగా మేము పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి అభివృద్ధికి దోహదపడే విధంగా పనిచేస్తున్నాయని రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా లోకేష్ సిడ్నీలో ఉన్న ప్రముఖ బిజినెస్ లీడర్లను పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వాములుగా మారమని ఆహ్వానించారు. మా రాష్ట్రం పరిశ్రమల కేంద్రంగా మారబోతోంది. సాంకేతికత, విద్య, వ్యవసాయం, తయారీ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని పిలుపునిచ్చారు.